కొండగట్టుకు మినీ బస్ సర్వీసులు ప్రారంభం

September 20, 2018
img

జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోవడంతో ఆర్టీసీ అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. పనికిరాని డొక్కు బస్సులను అనుమతిలేని మార్గంలో నడిపించి ప్రజల ప్రాణాలు బలిగొన్నారని తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. దాంతో అప్పటి నుంచి కొండగట్టుకు ఆర్టీసీ బస్సులు నడిపించడానికి జంకుతున్న అధికారులు, రెండు కొత్త మినీ బస్సులను ఏర్పాటు చేసి నేటి నుంచి సర్వీసులను ప్రారంభించనున్నారు. కొండగట్టు గుట్ట-జేఎన్‌టీయూ- పిల్లలమర్రి-దిగువ కొండగట్టు మార్గంలో ఈ రెండు బస్సులు నడుస్తాయి. రోజుకు 22 ట్రిప్పులు నడిపించాలని నిర్ణయించారు. 

ఇక కొండగట్టు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరపున రూ.3 లక్షలు కలిపి మొత్తం రూ.8 లక్షలు అందించాలని, మృతుల కుటుంబాలలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడినవారు పూర్తిగా కోలుకోనేవరకు వైద్య ఖర్చులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు పంపించారు.

Related Post