అమీర్‌పేట-ఎల్‌బీనగర్‌ మెట్రో ముహూర్తం ఖరారు

September 20, 2018
img

 హైదరాబాద్‌ నగరవాసులు ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న అమీర్‌పేట-ఎల్‌బీనగర్‌ మార్గంలో మెట్రో సర్వీసులు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు గవర్నర్ నరసింహన్‌ అమీర్ పేట మెట్రో స్టేషన్లో మెట్రో రైలుకు పచ్చజెండా ఊపి ఆ మార్గంలో మెట్రో సేవలు ప్రారంభిస్తారు. అప్పటి నుంచి ఆ మార్గంలో  మెట్రో రైల్ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.

అమీర్‌పేట-ఎల్‌బీనగర్‌ మెట్రో కారిడార్ వివరాలు:

16కిమీ పొడవుండే ఈ మార్గంలో అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ వరకు మొత్తం 17 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. అమీర్‌పేట, పంజగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, లక్దీకాపూల్, అసెంబ్లీ, నాంపల్లి, గాంధీ భవన్, ఓ.ఏం.సి., ఎంజి బస్టాండ్, మలక్ పేట, మూసారం బాగ్, న్యూ మార్కెట్, దిల్ షుక్ నగర్, చైతన్యపురి, విక్టోరియా మెమోరియల్,  ఎల్‌బీనగర్‌ వద్ద మెట్రో స్టేషన్లు నిర్మించబడ్డాయి.

నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల గుండా ఈ మెట్రో కారిడార్ నిర్మించినందున, మిగిలిన రెండు కారిడార్స్ కంటే దీనిలో ప్రయాణించేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మార్గంలో మెట్రో సర్వీసులు ప్రారంభం అయితే మియాపూర్-ఎల్‌బీనగర్‌ మార్గంలో ఉన్న ప్రాంతాలలో ఎక్కడికి వెళ్లాలన్న అమీర్‌పేటలో రైలు మారనవసరం లేకుండా చేరుకోవచ్చు. ఇక ఈ మార్గంలో నడిచే మెట్రో రైళ్ళలో అత్యాధునిక కమ్యూనికేషన్ ఆధారిత టెక్నాలజీని వినియోగిస్తున్నారు కనుక డ్రైవర్ ప్రమేయం లేకుండానే నడుస్తాయి. 

Related Post