తెలంగాణాకు మరో భారీ పరిశ్రమ

September 18, 2018
img

తెలంగాణా ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న స్నేహపూర్వకమైన పారిశ్రామిక విధానాల వలన రాష్ట్రానికి అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలు తరలి వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా సెమీ కండక్టర్ తయారీలో ప్రపంచ ప్రసిద్ది చెందిన మైక్రాన్ టెక్నాలజీ సంస్థ తెలంగాణాలో రూ.300 కోట్లు పెట్టుబడితో పరిశ్రమ స్థాపించేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మైక్రాన్ సంస్థ సీనియర్ డైరక్టర్ స్టీఫెన్ డ్రీక్, దాని భారతీయ ప్రతినిధి అమరేందర్ సిద్దూ ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, సి.ఆర్.వో. అమర్ నాధ్, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా స్టీఫెన్ డ్రీక్ మీడియాతో మాట్లాడుతూ, “మేము సింగపూర్, జపాన్, తైవాన్, చైనా, మలేషియా దేశాలలో సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమలను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నాము. భారత్ లో మా మొట్టమొదటి సంస్థను తెలంగాణా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిశ్చయించుకొన్నాము. ఇక్కడ భౌగోళిక పరిస్థితులు, వసతులు, సౌకర్యాలు, పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అన్ని మాకు చాలా అనుకూలంగా ఉన్నందున హైదరాబాద్‌ను ఎంచుకొన్నాము. మా సంస్థకు కేవలం 15 రోజులలోనే తెలంగాణా ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు మంజూరు చేసి ప్రోత్సహించడం మాకు చాలా సంతోషం కలిగించింది, అని అన్నారు. 

మాదాపూర్‌లో 1.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని స్టీఫెన్ డ్రీక్ చెప్పారు. అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలకు మైక్రాన్ టెక్నాలజీ పెట్టింది పేరు. మెమొరీ ఆధారిత టెక్నాలజీ ఈ సంస్థ ప్రత్యేకత. బాలిస్టిక్, క్రూషియల్ వంటి అంతర్జాతీయ సంస్థలు మైక్రాన్ టెక్నాలజీకి చెందినవే. హైదరాబాద్‌లో నెలకొల్పబోతున్న ఈ సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్, మెషీన్ లెర్నింగ్, డ్రైవర్ లెస్ వెహికిల్స్ వంటి రంగాలలో కృషి చేయబోతోందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇటువంటి ప్రపంచ ప్రసిద్ది చెందిన సంస్థ రాష్ట్రానికి తరలిరావడానికి కారణం రాష్ట్ర పారిశ్రామిక విధానంలో చేసిన సంస్కరణలేనాని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Related Post