ఐకియా తూనే క్యా కియా!

August 11, 2018
img

ఐకియా, హైదరాబాద్‌...దేశంలో మొట్టమొదటి అతిపెద్ద ఫర్నీచర్ స్టోర్. నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఐకియా స్టోర్స్ మొదటిరోజున జనాలతో నిండిపోయింది. దాని గురించి ఆనోటా విన్నవారు..అది ప్రారంభం కాగానే వేలాదిగా తరలివచ్చారు. ఐకియా మొదటి రోజున సుమారు 40,000 మందికి పైగా తరలివచ్చినట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. . మొదటిరోజునే ఇన్ని వేలమంది ప్రజలు తరలివస్తారని ఊహించలేకపోయిన ఐకియా సెక్యూరిటీ సిబ్బంది జనాలను కంట్రోల్ చేయలేక నానా ఇబ్బందిపడ్డారు. ఒకేసారి అన్నివేలమంది తరలిరావడంతో అసలే ఎప్పుడూ రద్దీగా ఉండే గచ్చిబౌలి తదితర ప్రాంతాలన్నీ వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయ్యాయి. ఐకియాకు వచ్చే వాహనాలతో ట్రాఫిక్ జామ్ అవడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా నానా తిప్పలు పడ్డారు. అప్పటికీ ఐకియా ప్రాంగణంలో ఒకేసారి 1200 కార్లు, 700 ద్విచక్రవాహనాలను పార్కింగ్ చేసుకొనేందుకు సువిశాలమైన పార్కింగ్ సౌకర్యం కల్పించింది. శుక్రవారం అది పూర్తిగా నిండిపోవడంతో అప్పటికప్పుడు స్టోర్ బయట కొన్ని ప్రాంతాలకు వాహనాలను మళ్ళించి పార్కింగ్ సౌకర్యం కల్పించవలసి వచ్చింది.   

మొదటిరోజునే అనేకమంది సకుటుంబ సపరివార సమేతంగా తరలివచ్చి బారీగా కొనుగోళ్ళు చేశారు. ఐకియా మొదటిరోజు ఆదాయం ఎంతో అధికారికంగా చెప్పనప్పటికీ సుమారు కోటి రూపాయల వరకు ఉండవచ్చునని సమాచారం. అంటే నగరవాసులలో ఐకియా పట్ల ఎంతగా ఆకర్షితులయ్యారో అది ఏ రేంజులో బిజినెస్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఐకియాలోపలకు ప్రవేశించడానికి ప్రజలు కాస్త ఇబ్బందిపడినప్పటికీ, లోపల ఉంచిన అద్భుతమైన ఆ వస్తువులను, ఆధునికమైన గృహోపకరణాలను చూసి మురిసిపోతూ కొనుగోలు చేశారు. 

కొత్తగా పెళ్ళైన ఒక జంట తమ కొత్త ఇంటికి అవసరమైన ఫర్నీచర్, గృహోపకరణాలను కొనుక్కోవాలనుకొన్నారు. కానీ త్వరలో ఐకియా ప్రారంభోత్సవం జరుగబోతోందని తెలిసి రెండు నెలలు దానికోసం వేచి చూసి నిన్న ఐకియాలో తమ కొత్త ఇంటికి అవసరమైన వాటిని కొనుగోలు చేశామని చెప్పారు. ఇటువంటివారెందరో నిన్న ఐకియా ముందుబారులు తీరి మరీ కొనుగోలు చేశారు. 

ఇకముందు కూడా ఐకియా ఇదే స్థాయిలో ప్రజలను ఆకర్షించి బిజినెస్ చేయగలిగితే, అది మరెన్నో ఫర్నీచర్ తయారీ సంస్థలకు స్పూర్తి కలిగించి, ఐకియాకు ధీటుగా అన్ని రాష్ట్రాలలో ఇటువంటి బారీ స్టోర్స్ ప్రారంభంకావచ్చు. 


Related Post