ఐకియా షురూ కియా...

August 09, 2018
img

స్వీడన్ కు చెందిన అంతర్జాతీయ ఫర్నీచర్ సంస్థ ఐకియా భారతదేశంలో తన మొట్టమొదటి స్టోర్ కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం విశేషం. నగరంలో హైటెక్ సిటీ సమీపంలో 13ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో సుమారు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన ఐకియా స్టోర్ గురువారం ప్రారంభం కాబోతోంది. దేశంలో ఇంత పెద్ద ఫర్నీచర్ స్టోర్ మరెక్కడా లేదు. దీని కోసం ఐకియా రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ స్టోర్ లో సుమారు 7,500 రకాల గృహోపకరణాల వస్తువులు లభిస్తాయి. వాటిలో సుమారు 1,000కి పైగా వస్తువుల ధరలు కేవలం రూ.200లేనని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. దేశవిదేశాలలో లభించే ఇంటికి కావలసిన అన్ని రకాల గృహోపకరణాలు ఈ స్టోర్ లో లభిస్తాయని తెలిపారు. ఐకియాలో అమ్మే వస్తువులలో 20 శాతం స్థానికంగా తయారుచేసినవి కూడా ఉంటాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ లో ప్రత్యక్షంగా 950 మందికి, పరోక్షంగా మరో 1,500 మనదిక్ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఆ సంస్థ భారత్ సిఈఓ పీటర్ బెట్జెల్ తెలిపారు. 



ఐకియా, హైదరాబాద్‌ స్టోర్ లో ఒక అతిపెద్ద రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేశారు. దానిలో స్వీడిష్ వంటకాలను వడ్డించబోతున్నట్లు అయన తెలిపారు. అదిగాక రెస్టారెంట్ లో శాఖాహారం, మాంసాహారం సెక్షన్స్ వేర్వేరుగా ఉంటాయి. దీనిలో ఒకేసారి 1,000 మంది కూర్చోనవచ్చునంటే రెస్టారెంట్ ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. దీనిలో అత్యంత నాణ్యమైన, రుచికరమైన ఆహారపదార్ధాలను తక్కువ ధరలకే అధిస్తామని పీటర్ బెట్జెల్ తెలిపారు. 


హైదరాబాద్‌ తరువాత ముంబై, బెంగళూరు, డిల్లీలో ఐకియా స్టోర్స్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వాటి తరువాత కోల్‌కత్తా, చెన్నై, అహ్మదాబాద్, సూరత్, పూణే నగరాలలో స్టోర్స్ ఏర్పాటు చేయబోతోంది. వీటి కోసం తమ సంస్థ మొత్తం రూ.10,500 కోట్లు పెట్టుబడి పెట్టబోతోందని, ఇప్పటికే రూ 4,500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 2025 నాటికి భారత్ లో 25 ఐకియా స్టోర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని పీటర్ బెట్జెల్ తెలిపారు. 

Related Post