సిర్పూర్ తరువాత బిల్ట్ మిల్స్ పునరుద్దరణ?

August 08, 2018
img

గతంలో రాష్ట్రంలో ఏదైనా బారీ పరిశ్రమ నష్టాలలో కూరుకుపోతుంటే దానిని కాపాడేందుకు పాలకులు మొక్కుబడి ప్రయత్నాలు చేసి సాధ్యం కాకపోతే చేతులు దులుపుకొనేవారు. ఆవిధంగా మూతపడినవే సిర్పూర్ పేపర్ మిల్స్, రామగుండం ఫెర్టిలైజర్స్, నిజాం షుగర్స్, బిల్ట్ పేపర్ మిల్స్ వగైరాలు. అయితే తెలంగాణా ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత మూతపడిన ఆ పరిశ్రమలన్నిటినీ మళ్ళీ తెరిపించేందుకు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల కారణంగానే సిర్పూర్ పేపర్ మిల్స్ త్వరలో మళ్ళీ ఉత్పత్తి ప్రారంభించబోతోంది. దాని తరువాత ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న బిల్ట్ పేపర్ మిల్స్ (బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్)ను తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. 

ఆ సంస్థ పునరుద్దరణకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చించడానికి వచ్చారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌ వారితో చర్చించారు. తమ సంస్థ పునరుద్దరణకు రాష్ట్ర ప్రభుత్వం 2015లో ఆఫర్ చేసిన ప్యాకేజీ ఇవ్వాలని వారు మంత్రులను కోరారు. అందుకు మంత్రులు సానుకూలంగా స్పందించారు. ఒకవేళ ఆ ప్యాకేజీతో బిల్ట్ యాజమాన్యం పేపర్ మిల్స్ ను పునరుద్దరించలేకపోయినట్లయితే, ప్రభుత్వం దానిని ఐటిసి సంస్థకు అప్పగించే  ఆలోచన చేస్తోంది. 

దేశంలో రెయాన్ గ్రేడ్ ముడిసరుకును వినియోగించి పేపరును ఉత్పత్తి చేసే సంస్థ బిల్ట్ ఒక్కటే కానీ వివిధ కారణాల చేత నష్టాలపాలవడంతో 2016లో ఇది మూతపడింది. అప్పటి నుంచి ఆ పరిశ్రమలో చేస్తున్న కార్మికులు వారి కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నారు. కనుక ఆ పరిశ్రమను మళ్ళీ తెరిపించి వారందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆ సంస్థ యాజమాన్యం తనంతట తానుగా ముందుకు వచ్చింది కనుక త్వరలోనే అది కూడా మళ్ళీ పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Post