తెలంగాణాకు మరో కొత్త ప్రాజెక్టు

August 08, 2018
img

తెలంగాణా రాష్ట్రంలో ఐదున్నర లక్షల ఇళ్ళకు పైప్ లైన్ల ద్వారా వంటగ్యాస్ సరఫరా చేసే ఒక ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్ మరియు రూరల్, జయశంకర భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో మొత్తం ఐదున్నర లక్షల ఇళ్ళకు వంటగ్యాస్ సరఫరా చేసేందుకు పైప్ లైన్లను వేసే కాంట్రాక్టు తమ సంస్థకు దక్కిందని మేఘా ఇంజనీరింగ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేష్ రెడ్డి తెలియజేశారు. 

ఈ పది జిల్లాలలో తమ సంస్థ మొత్తం 3,100 కిమీ పొడవునా పైప్ లైన్లు నిర్మించబోతున్నట్లు చెప్పారు. దానిలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలో 800 కిమీ పైప్ లైన్ వేసి లక్ష ఇళ్ళకు, వరంగల్ అర్బన్ మరియు రూరల్, జయశంకర భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్ జిల్లాలలో 800 కిమీలు పైప్ లైన్ వేసి లక్ష ఇళ్ళకు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో 1,500 కిమీ పైప్ లైన్ వేసి 3.5 లక్షల ఇళ్ళకు గ్యాస్ కనెక్షన్స్ ఇస్తామని రాజేష్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా 80 గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లను నిర్మించబోతున్నామని తెలిపారు.


Related Post