సిర్పూర్ పేపర్ మిల్లు లైన్ క్లియర్!

July 20, 2018
img

సిర్పూర్ పేపర్ మిల్లు త్వరలో పునః ప్రారంభంకాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం బారీగా రాయితీలు ప్రకటించి, దానిలో ఇదివరకు పనిచేసిన ఉద్యోగుల జీతాల బకాయిలు మొత్తం చెల్లించడానికి అంగీకరించడంతో పేపర్ ఉత్పత్తిలో దేశంలో నెంబర్:1 స్థానంలో ఉన్న గుజరాత్ కు చెందిన జెకె పేపర్ మిల్స్ సంస్థ దానిని స్వాధీనం చేసుకొని నడిపించడానికి  ముందుకు వచ్చింది. 

ఆ ప్రయత్నాలలో భాగంగా ఆ సంస్థపై ఉన్న అప్పులను లెక్కకట్టి వాటిని తీర్చేందుకు జెకె పేపర్ మిల్స్ సమర్పించిన ఒక నివేదికను హైదరాబాద్ నగరంలోగల నేషనల్ లా ట్రిబ్యునల్ గురువారం ఆమోదించింది. దీంతో ఆ సంస్థ పునః ప్రారంభానికి ఉన్న ఆఖరి అవరోధం తొలగిపోయింది. కనుక త్వరలోనే జెకె పేపర్ మిల్స్ సంస్థ ఆదిలాబాద్ జిల్లాలో గల సిర్పూర్ పేపర్ మిల్స్ కర్మాగారాన్ని...దాని ఆస్తుల స్వాధీన ప్రక్రియను ప్రారంభించవచ్చు. 

పేపర్ మిల్లు మూతపడటంతో దానిలో పనిచేసిన కార్మికులు అందరూ రోడ్డున పడ్డారు. వారిలో అర్హులను ఎంపిక చేసుకొనే ప్రక్రియ కూడా త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది. అలాగే కార్యాలయ సిబ్బంది తదితరులను కూడా నియమించుకోవలసి ఉంటుంది. ఆ తరువాత...గత నాలుగేళ్ళుగా మూతపడి ఉన్న పేపర్ మిల్లులో యంత్రాలు మరమత్తులు చేయవలసి ఉంటుంది. అవసరమైన చోట ఆధునీకరించవలసి ఉంటుంది. అలాగే మిల్లు, కార్మికుల నివాస సముదాయాలు, ఇతర భవనాల మరమ్మతులు చేయవలసి ఉంటుంది. ఆలోగా పేపర్ ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకును సిద్దం చేసుకోవలసి ఉంటుంది. ఇవన్నీ పూర్తయ్యి మిల్లులో ఉత్పత్తి ప్రారంభం కావడానికి మరొక ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. బహుశః ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా సిర్పూర్ పేపర్ మిల్లు మళ్ళీ ఉత్పత్తి ప్రారంభించి కార్మికులతో కళకళలాడవచ్చు. 

ఈ సంస్థను పునః ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అనేక రాయితీలు ఇచ్చారు. ఆ వివరాలు: 

1. పదేళ్ళపాటు ఎస్.జి.ఎస్.టి.రాయితీ.

2. పదేళ్ళపాటు రూ.50 కోట్లవరకు పెట్టుబడిపై 20 శాతం రాయితీ.

3. పదేళ్ళపాటు టన్నుకు రూ.1,000 చొప్పున రాయితీపై బొగ్గు సరఫరా.  

4. పదేళ్ళపాటు విద్యుత్ చార్జీలు మినహాయింపు.

5. పదేళ్ళపాటు ముడిసరుకులు (డీబార్కడ్‌ యూకా, సుబాబుల్) సరఫరాపై రాయితీ.    

6. ఐదేళ్ళ వరకు కొత్త పెట్టుబడులపై 2శాతం వడ్డీలో రాయితీ.

7. స్టాంప్ డ్యూటీపై 100 శాతం రాయితీ.

8. రెండు నెలలోపుగా అన్ని రకాల లైసెన్సులు మంజూరు.

9. ఉద్యోగుల జీతభత్యాల బకాయిలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.

ఈ మిల్లు పునః ప్రారంభించదానికి రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కేటిఆర్ చూపిన ప్రత్యేక శ్రద్ధ, చొరవ చేసిన కృషి అభినందనీయం. అయనే పూనుకోకపోయుంటే సిర్పూర్ పేపర్ మిల్లు ఎప్పటికీ ఖాయిలా సంస్థగానే ఉండిపోయేదేమో? సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడటంతో రోడ్డున పడి ఇంతకాలం దయనీయమైన జీవితాలు గడుపుతున్న దానిలో పనిచేసిన కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పేపరు మిల్లు మళ్ళీ తెరుచుకోబోతోందనే వార్త తెలుసుకొని ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.

Related Post