త్వరలో కొత్త 100 నోటు

July 20, 2018
img

నోట్ల రద్దు తరువాత రిజర్వ్ బ్యాంక్ కొత్తగా రూ.2,000, 500 నోట్లను ముద్రించి మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ తరువాత కొత్త రూ.200, 50 నోట్లను ముద్రించింది. ఇప్పుడు కొత్త రూ.100 నోట్లను ముద్రించి త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. 

కొత్త రూ.100 నోట్ల డిజైన్ ను అర్.బి.ఐ. గురువారం వెల్లడించింది. ఊదారంగులో ఉన్న ఆ కొత్త రూ.100 నోట్లకు ఒకపక్క యధాప్రకారం మహాత్మాగాంధీ బొమ్మ దాని పక్కన ఒక ముక్కోణపు చిహ్నం ముద్రించబడింది. అంధులు సైతం సులువుగా గుర్తించేవిధంగా నోటుకు కుడి,ఎడమలవైపు త్రెడ్ లను కాస్త ఉబ్బెత్తుగా ఉండేవిధంగా ముద్రించారు. నోటుకు మరొకవైపు చారిత్రిక బావిగా పేరొందిన ‘రాణీ కీ వావ్’ బొమ్మను ముద్రించారు. గుజరాత్ లోని పఠాన్ అనే ప్రాంతంలో సరస్వతీనదీ తీరంలో 11వ శతాబ్దంలో ఆ మెట్ల బావి నిర్మించబడింది. 

పాత వంద నోట్లతో పోలిస్తే కొత్త నోట్లు కొంచెం చిన్నవిగా ఉంటాయి. త్వరలోనే కొత్తనోట్లు మార్కెట్లలోకి విడుదల చేయబోతున్నట్లు ఆర్.బి.ఐ. ప్రకటించింది. కొత్తవి చలామణిలోకి వచ్చినప్పటికీ పాతనోట్లు కూడా చెల్లుతాయని తెలిపింది. పాత నోట్లతో పోలిస్తే కొత్త నోట్లలో సెక్యూరిటీ ఫీచర్లు ఎక్కువగా ఉంటాయి. కనుక వాటికి నకిలీలు ముద్రించడం కష్టమని ఆర్.బి.ఐ. అధికారులు చెప్పారు. 

ఆర్.బి.ఐ.తరచూ కొత్తనోట్లు ముద్రిస్తూ మార్కెట్లలోకి విడుదల చేస్తుండటం వ్యూహాత్మకమేనని భావించవచ్చు. దశాబ్దాలుగా ఎటువంటి మార్పులు లేకుండా దేశవ్యాప్తంగా పాతనోట్లే చలామణిలో ఉన్నందున వాటికి నకిలీలు ముద్రించబడుతున్నాయి. ఈ నకిలీ కరెన్సీ వలన దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తింటోంది. కనుక వాటిని అరికట్టడం కోసం మంచి సెక్యూరిటీ ఫీచర్లున్న కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్లు భావించవచ్చు. అయితే తరచూ కొత్త కొత్త నోట్లు చలామణిలోకి వస్తునందున ప్రజలు అయోమయానికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నకిలీనోట్లు ముద్రించేవారికి ఇదీ ఒక అవకాశంగా మారవచ్చు.  

Related Post