రోడ్డున పడ్డ సీడికే గ్లోబల్ ఉద్యోగులు

July 19, 2018
img

ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు పెద్ద హిట్ కానీ ఇప్పుడు ఫట్. ఎందుకంటే ఇప్పుడవి తుమ్మితే ఊడిపోయే ముక్కులా మారాయి కనుక. అందుకు తాజా ఉదాహరణగా హైదరాబాద్ లోని సీడికే గ్లోబల్ ఇండియా ఉద్యోగుల గురించి చెప్పుకోవచ్చు. 

రోజూలాగే బుధవారం కూడా ఉద్యోగులు అందరూ ఉదయం ఆఫీసుకు చేరుకొని తమ క్యాబిన్లలో పనులు మొదలుపెట్టారు. అంతలోనే హెచ్.ఆర్.విభాగం నుంచి ఒకరొకరికి పిలుపులు రాసాగాయి. అలాగా మొత్తం 103 మంది లోపలకు వెళ్లి వచ్చారు. వారందరినీ రాజీనామా పత్రాలు వ్రాసి ఇచ్చి వెంటనే ఆఫీసులో నుంచి బయటకు వెళ్లిపోవాలని         హెచ్.ఆర్. అధికారులు చెప్పారు. మర్యాదగా రాజీనామాలు చేయకపోతే మళ్ళీ ఎక్కడా ఉద్యోగాలు దొరక్కుండా చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారుట! ఇక చేసేదేమీ లేక అందరూ రాజీనామాలు చేసి రోడ్డున పడ్డారు. 

అయితే వారి అంగీకారంతోనే ఉద్యోగాలలో నుంచి తొలగించామని ఆ సంస్థ ఎండి అరవింద్ చతుర్వేది చెప్పడం విశేషం. ఒకవేళ అతను చెప్పిందే నిజమైతే, ఆ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీయే వారికి లేఖలు ఇవ్వాలి కానీ రాజీనామా లేఖలు ఎందుకు తీసుకొంది?అనే ప్రశ్నకు సమాధానం లేదు.

రోడ్డున పడ్డ సీడికే గ్లోబల్ ఉద్యోగులు కార్మికశాఖ కార్యాలయానికి వెళ్లి సంస్థపై పిర్యాదు చేశారు. కానీ బౌన్సార్లను పెట్టి ఉద్యోగులను తొలగించిన వెరిజాన్ సంస్థపైనే ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోనప్పుడు ఈ సంస్థపై చర్యలు తీసుకొంటారని ఆశించడం అత్యాశే అవుతుంది.   


Related Post