మెట్రో- ఆర్టీసి ఏది ముఖ్యం?

July 11, 2018
img

హైదరాబాద్ నగరానికే కాక యావత్ రాష్ట్రానికి ఒక కొత్త గుర్తింపు తెచ్చిన సంస్థ హైదరాబాద్ మెట్రో రైల్వే. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు సైతం సేవలు అందిస్తున్న సంస్థ టిఎస్ ఆర్టీసి. ఈ రెండింటిలో ఏది ముఖ్యం? దేనిని కాపాడుకోవాలి? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. కానీ మెట్రోను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. 

హైదరాబాద్ నగరంలో సమీకృత ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. దాని అధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ బస్ భవన్ లో ఒక సమావేశం జరిగింది. దానిలో మెట్రో, ఆర్టీసి, రైల్వే, జి.హెచ్.ఎం.సి.,ఊబర్, ఓలా, సెట్విన్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలో అందుబాటులో ఉన్న వివిద రవాణా వ్యవస్థలను మరింత బాగా ఏవిధంగా వినియోగించుకోవచ్చుననే అంశంపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఇదే అంశంపై చర్చించేందుకు మరో రెండు రోజులు సమావేశం నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన పి.ఆర్.ఓ.(పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) జి. కిరణ్ రెడ్డి చెప్పారు. నగరంలో ప్రస్తుతం 3,800 ఆర్టీసి బస్సులు తిరుగుతున్నాయని, అవసరమైన చోట్ల బస్సులను నియంత్రించి ఫీడర్ సర్వీసులుగా క్రమబద్దీకరిస్తామని చెప్పారు. మరొక రెండు నెలలలో ఈ విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని చెప్పారు. టి-సవారీ యాప్ తో మెట్రో, ఆర్టీసి, ఊబర్, ఓలా మొదలైన ఏ రకమైన రవాణా సదుపాయాలనైనా వినియోగించుకోవచ్చునని తెలిపారు. మెట్రో చార్జీలు తగ్గించే అవకాశం లేదని స్పష్టం చేశారు.

మెట్రో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ టికెట్ చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నందున రోజు దానిలో ప్రయాణించడం కష్టమని భావిస్తున్న సామాన్య ప్రజలు ఆర్టీసి బస్సులలోనే ప్రయాణిస్తున్నారు. ఆర్టీసి బస్సులో అయితే తమ గమ్యస్థానాలకు అత్యంత సమీప ప్రదేశాలకు చేరుకొనే వెసులుబాటు ఉండటం మరో కారణం. ఆర్టీసికి మంచి ప్రజాధారణ లభిస్తున్నప్పటికీ అందరికీ తెలిసిన కారణాల చేత నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. దానిని కాపాడుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలించడంలేదు. 

ఈ పరిస్థితులలో నగరంలో ఆర్టీసి బస్సులను నియంత్రిస్తే అది పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. వేలకోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసుకొన్న మెట్రో వ్యవస్థను కాపాడుకోవడం చాలా అవసరమే. కానీ దాని కోసం సామాన్యుల వాహనమైన ఆర్టీసిని పణంగా పెట్టనవసరం లేదు. ఆర్టీసి బస్సులను క్రమబద్దీకరించాలని ప్రయత్నిస్తే ప్రజలే కాదు ఆర్టీసి కార్మికులు కూడా అంగీకరించకపోవచ్చు. కనుక అటువంటి ఆలోచనలు చేస్తున్నట్లయితే విరమించుకోవడం మంచిది.

Related Post