బి.హెచ్.ఈ.ఎల్.కు తెలంగాణా జన్-కో బారీ ఆర్డర్

June 21, 2018
img

ప్రభుత్వ రంగసంస్థలని ప్రోత్సహించవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉన్నప్పటికీ, చాలా రాష్ట్రాలు ప్రైవేట్ సంస్థలకే పనులను కట్టబెట్టడానికి ఆసక్తి చూపుతాయి. కానీ తెలంగాణా ప్రభుత్వం మాత్రం వీలైన ప్రతీచోట ప్రభుత్వ రంగసంస్థలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది. కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉండేది. అప్పుడు ప్రభుత్వం కావాలనుకుంటే ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు అవకాశం కల్పించవచ్చు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్.టి.పి.సి.కె. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాధాన్యం ఇచ్చి దాని చేతే విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నెలకొల్పుతున్నారు. 

అలాగే ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాష్ట్రంలో రైతులందరికీ జీవితభీమా పధకాన్ని వర్తింపజేయాలనుకున్నప్పుడు ప్రభుత్వ రంగసంస్థ అయిన ఎల్.ఐ.సి.కి అవకాశం కల్పించి తద్వారా ఆ సంస్థకు బారీగా బిజినెస్ సమకూర్చారు. తాజాగా ప్రభుత్వరంగ సంస్థ అయిన బి.హెచ్.ఈ.ఎల్.కు రూ. 10,000 కోట్లు విలువ చేసే రెండు ఆర్డర్లు ఇచ్చింది తెలంగాణా జన్-కో సంస్థ. భద్రాద్రి కొత్తగూడెం వద్ద ధర్మల్ విద్యుత్ ఉత్పతి కేంద్రంలో కాలుష్య నివారణ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆ సంస్థకు ఆర్డర్ లభించింది. 

అదేవిధంగా రాష్ట్రంలో చేనేత కార్మికులు తయారు చేస్తున్న దుస్తులు, చీరలు, దుప్పట్లు మొదలైనవాటిని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వాసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలలో వినియోగిస్తోంది. తద్వారా వారికి చేతి నిండాపని, అదాయం కల్పిస్తోంది. వారికి ఆర్డర్లు ఇవ్వడం వలన ప్రభుత్వానికి కూడా చవుకలో నాణ్యమైన దుస్తులు, చీరలు, దుప్పట్లు మొదలైనవి లభిస్తున్నాయి. 

ఈవిధంగా ప్రభుత్వరంగసంస్థలకు ఆర్డర్లు ఇవ్వడం ద్వారా వాటికీ ఆదాయం సమకూరుస్తూ వాటి మనుగడకు తెరాస ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. ప్రభుత్వం-ప్రభుత్వ రంగ సంస్థల మద్య జరిగే వ్యాపార వ్యవహారాలు కనుక అవినీతికి ఆస్కారం ఉండదు. పారదర్శకత ఉంటుంది. కానీ అన్ని రంగాలలోను ప్రభుత్వ రంగసంస్థలు ఉండవు కనుక అవిసేవలు అందించలేని రంగాలను ప్రైవేట్ రంగానికి అప్పగించవలసివస్తోంది.

Related Post