యాదాద్రి జిల్లాలో ఆటోమొబైల్ పార్కు

April 24, 2018
img

ఒకప్పుడు అభివృద్ధి అంతా హైదరాబాద్ నగరానికే పరిమితమై ఉండేది. కానీ రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో ఆయా జిల్లాలలో ఉన్న వనరులను బట్టి వివిధ రకాల పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ప్రాజెక్టులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కెసిఆర్ తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో 10 జిల్లాలను పునర్విభజించి 31 జిల్లాలను ఏర్పాటు చేశారు. వాటిలో యదాద్రి భువనగిరి జిల్లా కూడా ఒకటి.    

రాజధాని హైదరాబాద్ నగరానికి అతిసమీపంలో ఉన్న యాదాద్రి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంటుందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి చౌటుప్పల్ మండలంలో దండు మల్కాపూర్ వద్ద సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో ఒక అతిపెద్ద ఆటోమొబైల్ పార్కును ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో తెలంగాణా ఇండస్ట్రియల్ ఫెడరేషన్ (టిఐఎఫ్) సేకరించిన 377 ఎకరాలలో రూ.54 కోట్లు వ్యయంతో టిఎస్ఐసిసి మౌలికవసతులు కల్పిస్తోంది. ‘హరిత ఎంఎస్ఎంఈ’ పేరిట ఒక బారీ పారిశ్రామికవాడను ఏర్పాటు చేస్తోంది. ఆ పరిశ్రమలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల నివాసం కోసం అక్కడే 190 ఎకరాలలో ఒక పెద్ద టౌన్ షిప్ కూడా నిర్మించబోతోంది. 

ఆ పారిశ్రామికవాడకు అనుబంధంగా మరో 223 ఎకరాలు సేకరించి దానిలో ఆటోమొబైల్ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ ప్రక్రియ పూర్తికాగానే, దానిని కూడా టిఎస్ఐసిసి అభివృద్ధి చేసి అప్పగించిన తరువాత ఈ పార్కు ఏర్పాటు అవుతుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తవడానికి బహుశః 8-12 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ పారిశ్రామికపార్కు పనులు పూర్తయి పరిశ్రమలు వస్తే వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ కార్యక్రమాలన్నీ సకాలంలో పూర్తయితే బహుశః 2019 జూన్-జూలై నాటికి యాదాద్రి జిల్లా కూడా ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా మారవచ్చు. 

Related Post