జి.హెచ్.ఎం.సి.చరిత్రలో నేటి నుంచి నూతన అధ్యాయం

February 22, 2018
img

జి.హెచ్.ఎం.సి.చరిత్రలో నేటి నుంచి నూతన అధ్యాయం మొదలైంది. నిధుల సమీకరణ కోసం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బిఎస్ఈ) లిస్టింగ్ లో ఈరోజు అధికారికంగా నమోదయింది. దీని కోసం జి.హెచ్.ఎం.సి. కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జి.హెచ్.ఎం.సి, బిఎస్ఈ, ఎస్.బి.ఐ. ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.      

 జి.హెచ్.ఎం.సి.కి వివిధ ఆర్ధిక సంస్థలు ‘ఏ ఏ’ క్రెడిట్ రేటింగ్ ఇచ్చిన కారణంగా కొన్ని రోజుల క్రితం రూ.200 కోట్ల విలువగల బాండ్లు జారీ చేయగా అనూహ్య స్పందన వచ్చింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే దానికి రెట్టింపు కంటే ఎక్కువగా రూ.452 కోట్లకు బిడ్లు వచ్చాయి. దానిని బట్టి జి.హెచ్.ఎం.సి.కి షేర్ మార్కెట్లో మంచి పేరు ఉందని స్పష్టం అవడంతో బిఎస్ఈలో చేరాలని నిర్ణయించారు. నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయంగా నిధులు సమకూర్చుకొని నగరంలో అభివృద్ధి పనులు చేపట్టాలని జి.హెచ్.ఎం.సి. భావిస్తోంది. ఇదివరకు పూణే నగరపాలక సంస్థ ఈవిధంగా బిఎస్ఈ ద్వారా నిధులు సమీకరించుకొంది. దాని తరువాత స్థానంలో జి.హెచ్.ఎం.సి. నిలిచింది.           


Related Post