ఆ మోడీ..ఈ మోడీతో భుజాలు రాసుకొన్నారు అందుకే...

February 16, 2018
img

విజయ్ మాల్యా బ్యాంకులకు రూ.9,000 కుచ్చు టోపీ పెట్టి లండన్ పారిపోవడం గురించి దేశప్రజలు కధలు కధలుగా చెప్పుకొంటుండగానే, ముంబాయికి చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, అతని భార్య, సోదరుడు, మరొక వ్యక్తి కలిసి ముంబై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పి.ఎన్.బి.)కు ఏకంగా రూ.11,400 కోట్లు కుచ్చు టోపీ పెట్టేసి స్విట్జర్లాండ్ పారిపోయి మాల్యా రికార్డును బ్రేక్ చేసేరని బ్రేకింగ్ వార్త వచ్చేసింది.

విశేషమేమిటంటే, నీరవ్ మోడీ చేస్తున్న మోసాల గురించి తెలుసుకోవడానికి పి.ఎన్.బి.కి ఏడేళ్ళు పట్టింది. ఈ విషయం సాక్షాత్ పి.ఎన్.బి. మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ మెహతా గురువారం మీడియాకు తెలిపారు. తమ ప్రాధమిక దర్యాప్తులో ఈ మోసం 2011లోనే మొదలైనట్లు గుర్తించమని తెలిపారు. కానీ 2018 జనవరి మూడవ వారంలో మోసం జరిగినట్లు తెలుసుకోగలిగామని, వెంటనే సిబిఐకి పిర్యాదు చేశామని చెప్పారు. అయితే ఆలోగానే అంటే జనవరి 1వ తేదీనే నీరవ్ మోడీ కుటుంబ సభ్యులతో సహా దేశం విడిచి పారిపోయాడు. కనుక మళ్ళీ ‘విజయ్ మాల్యా స్టోరీ రిపీట్స్’ అని సర్ది చెప్పుకోక తప్పదు. 

దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందిస్తూ ట్వీట్ చేశారు. “భారత్ ను దోచుకోవడానికి నీరవ్ మోడీ రూపొందించిన మార్గదర్శకాలు: ప్రధాని నరేంద్ర మోడీని ఆలింగనం చేసుకోవడం. దావోస్ లో ఆయనతో కలిసి ఫోటోలు దిగడం. వాటిని ఆధారంగా చేసుకొని రూ.12,000 దోచుకోవడం. కేంద్రప్రభుత్వం ఏటో చూస్తుండగా మెల్లగా భారత్ నుంచి బయటకు జారుకోవడం. #ఒక మోడీ నుంచి మరొక మోడీ.”   


Related Post