ఆదిభట్లలో విమాన ఇంజన్ల తయారీకేంద్రం

February 13, 2018
img

తెలంగాణా రాష్ట్రానికి మరొక పెద్ద పరిశ్రమ రాబోతోంది. టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మరియు జనరల్ ఎలక్ట్రిక్ సంస్థలు కలిసి రూ.3,000 కోట్లు పెట్టుబడితో రంగారెడ్డి జిల్లాలో ఆదిభట్ల వద్దగల ఆర్ధిక మండలిలో విమానాల ఇంజన్లను తయారుచేసే పరిశ్రమను స్థాపించబోతున్నాయి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదిభట్లలో 40 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ దానికి సోమవారం శంఖుస్థాపన చేశారు. 

ఈ పరిశ్రమలో జెట్ విమానాల ఇంజన్లు, సిఎఫ్ఎం లీఫ్ ఇంజన్ల విడిభాగాలు తయారు చేసి అసెంబుల్ చేస్తారు. ఈ పరిశ్రమలో ఇంజన్ టెస్టింగ్, పరిశోధన, అభివృద్ధి ( సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్) మొదలైన విభాగాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంస్థలో సుమారు 500 మంది వైమానిక నిపుణులకు, టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు లభిస్తాయి. తక్షణమే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించి ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఉత్పత్తి మొదలుపెట్టాలనుకొంటున్నట్లు జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ దక్షిణాసియా అధ్యక్షుడు, సీ.ఈ.వో. విశాల్‌ వాంచూ తెలిపారు. 

హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన ఈ కార్యక్రమానికి టాటా సన్స్‌ వైమానిక, రక్షణ, మౌలిక వసతుల విభాగం ఛైర్మన్‌ బన్మాలి అగ్రవాలా,  రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ ఎండీ ఇ.వెంకట నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు.

Related Post