నాంపల్లి మెట్రో స్టేషన్ : ఇటీజ్ డిఫరెంట్!

January 18, 2018
img

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండవ దశలో భాగంగా అమీర్ పేట నుంచి ఎల్.బి.నగర్ కారిడర్ లో నాంపల్లి స్టేషన్ వద్ద  నిర్మిస్తున్న మెట్రో రైల్వే స్టేషన్ కు ఊహించని సమస్యలు వచ్చాయి. కానీ వాటి కారణంగానే ఆ స్టేషన్ మిగిలిన అన్ని స్టేషన్ల కంటే ప్రత్యేకంగా నిలువబోతోంది. నగరం నడిబొడ్డున ఉన్న నాంపల్లి రైల్వే స్టేషన్ కు ఎదురుగా అనేక హోటల్స్, లాడ్జీలు ఉన్నాయి. కనుక అక్కడ మెట్రో రైల్వే స్టేషన్ నిర్మాణానికి భూసేకరణకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దాంతో అందుబాటులో ఉన్న స్థలంలోనే మెట్రో స్టేషన్ నిర్మిచాలని మెట్రో అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా మెట్రో స్టేషన్ డిజైన్లను సమూలంగా మార్చేసి, మెట్ల మార్గాలు, లిఫ్టులు, ఎస్కలేటర్లను అన్నీ ఒక్కవైపే ఉండేవిధంగా సరికొత్త డిజైన్లు సిద్దం చేసి పనులు మొదలుపెట్టారు. ఇదేకాకుండా నాంపల్లి రైల్వే స్టేషన్- మెట్రో రైల్వే స్టేషన్లను కలుపుతూ ఒక ‘స్కై-వాక్’ బ్రిడ్జిని కూడా నిర్మించాలనుకొంటున్నారు. అప్పుడు మెట్రో లేదా నాంపల్లి స్టేషన్లో దిగిన ప్రయాణికులు స్టేషన్ బయటకు రాకుండా ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్లోకి నేరుగా వెళ్ళిపోవచ్చు. ఇప్పటికే మెట్రో స్టేషన్లు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని, విమానాశ్రయాలకు తీసిపోనివిధంగా అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు నాంపల్లి స్టేషన్ల మద్య ఈ స్కై-వాక్ కూడా నిర్మిస్తే అదో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 

అమీర్ పేట-ఎల్.బి.నగర్ కారిడార్ లో చాలా రద్దీ ఉండే అవకాశం ఉంది. దానిని నాంపల్లి రైల్వే స్టేషన్ తో అనుసంధానం చేయడం వలన మరింత ఎక్కువ మంది ఉపయోగించుకొనేందుకు వీలుకలుగుతుంది. దాని వలన అటు ప్రయాణికులకు, హైదరాబాద్ మెట్రో సంస్థకు కూడా చాలా ప్రయోజనం కలుగుతుంది.

Related Post